శరవేగంగా అమృత్ భారత్ పనులు
– రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు
– ఆరు నెలల్లో తాండూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ
– సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
– తాండూరు రైల్వే స్టేషన్ సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్వే స్టేషన్ల సుందరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అమృత్ భారత్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. మంగళవారం భద్రతా తనిఖీలలో భాగంగా ఆయన తాండూరులోని రైల్వే స్టేషన్ ను సందర్శించారు. తాండూరులో అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనులను జీఎం అరుణ్ కుమార్ పరిశీలించారు. స్టేషన్లో వేయిటింగ్ హాల్, ప్లాట్ ఫారం పునరుద్దీకరణ, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులను దశలను సమీక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ కింద తాండూరు రైల్వే స్టేషన్ లో రూ.24 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పనులు శరవేగంగా జరుగుతుండడంతో ఆధునీకరణ పనులు ఆరు నెలల్లో పూర్తి కావచ్చని అన్నారు. రైల్వే శాఖ నుంచి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట దక్షణ మద్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు, సికింద్రబాద్ డివిజన్ అధికారులు తాండూరు రైల్వే స్టేషన్ అధికారులు ఉన్నారు.
రైళ్ల సర్వీసులను పొడగించండి….
తాండూరు రైల్వే స్టేషన్ ను జీఎం అరుణ్ కుమార్ సందర్శించిన సందర్భంగా తాండూరుకు చెందిన మార్వాడీ యువమంచ్ నాయకులు, రైల్వే ప్రయాణికులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తాండూరులో 10 గంటలు దాటిన తరువాత సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఎలాంటి రైళ్ల సౌకర్యం లేదని జీఎం దృష్టికి తీసుకవెళ్లారు. అదేవిధంగా ఇంటర్ సిటీ రైళ్ల సర్వీసులు, రేపల్లే, పల్నాడు రైల్వే సర్వీసులను తాండూరు వరకు పొడగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

