ఇసుక పర్మిట్ల గోల్‌మాల్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇసుక పర్మిట్ల గోల్‌మాల్..!
– పూర్తయిన రోడ్డుకు అనుమతులు
– మళ్లీ అదే పనుల పేరుతో జోర్దార్‌గా రవాణా
– గుడ్డిగా పర్మిషన్ ఇచ్చిన తహసీల్దార్
– 5 ట్రాక్టర్లతో ట్రిప్పులేస్తున్న ఇసుక వ్యాపారి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాకు ఎన్ని కట్టడి చర్యలు ప్రవేశ పెట్టినా అక్రమార్కులదే పైచేయిగా నిలుస్తోంది. ఇందులో అధికారుల ప్రమేయం లేకుండా అక్రమ ఇసుక రవాణా జరిగే ప్రసక్తే లేదని విమర్శలు కూడా వినిస్తుంటాయి. తాండూరు నియోజకవర్గంలో సోమవారం వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిస్తే అక్రమ ఇసుక పరిట్లు అంగట్లో సరుకుగా మారాయా అనే ఆశ్చర్య పోకుండా ఉండలేరు.

నెల రోజుల కిందనే పూర్తి అయిన పనులకు అధికారులు పర్మిషన్ ఇచ్చారంటే మీరే అర్థం చేసుకోవాలి. వివరాల్లోకి వెళితే… పెద్దేముల్ మండలం ఖానాపూర్ గ్రామంలో ఉపాధి హామి కింద రూ. 4లక్షలతో సీసీ రోడ్డు మంజూరు అయ్యింది. నెల రోజుల కిందనే తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక అనుమతులు పొంది రోడ్డు పనులు ప్రారంభించారు. ప్రోసిడింగ్లు చూపించి ఇసుక వ్యాపారులు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేశారు. తాండూరు మండలం ఖాంజాపూర్ వాగునుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేశారు. కొన్ని రోజుల్లో రోడ్డు పనులు పూర్తయ్యాయి. తాజాగా మూడు రోజుల క్రింద ఖానాపూర్‌లో పూర్తయిన రోడ్డు పనులకు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఇసుక పర్మిషన్లు జారీ చేస్తున్నట్లు ప్రోసిండింగ్ ఇచ్చారు. 5 ట్రాక్టర్ల ద్వారా 16 ట్రిప్పులకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రోసిడింగ్‌లో పేర్కొన్నారు. అయితే పూర్తయిన రోడ్డు పనులకు ఇసుక పర్మిట్లు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు యాలాల మండలం బషీర్ మీయా తాండాలోని పాఠశాలలో అభివృద్ధి పనుల పేరుతో కూడా ఇసుక అనుమతులు జారీ చేశారు. నిజానికి అక్కడ ఎలాంటి పనులు చేపట్టడం లేదు. పాఠశాల పేరుపై అనుమతులు పొంది ప్రైవేటుగా ఇండ్ల నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు అంగట్లో సరుకులా ఇసుక పర్మిషన్లు జారీ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ గుడ్డిగా పర్మిషన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రోసిడింగ్‌ల పేరుతో అనుమతులు పొందిన వ్యాపారి 5 ట్రాక్టర్ల ద్వారా ఖాంజాపూర్ కాగ్నా వాగునుంచి ఇసుక రవాణా చేస్తూ పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో డంప్ చేస్తున్నారు. ఈ విషయం తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ ఇకలేరు..!