సీసీ కెమెరాలే పట్టించాయ్..!
– దొరికిన గౌతాపూర్ గొర్రెల దొంగలు
– ఒరిస్సా గ్యాంగులోని ముగ్గురు నిందితుల రిమాండ్
– శ్రమించి చేధించిన కరణ్‌కోట్ ఎస్ఐ, అతని బృందం
– అభినందించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పోలీసులు పేర్కొంటారు. కేసుల చేధనలో అంతకీలకంగా పనిచేస్తాయి సీసీ కెమెరాలు. అందులో పోలీసుల శ్రమ కూడా ఉంటుంది. సీసీ కెమెరాలు, పోలీసుల శ్రమ తోడైతే కఠిన కేసులు కూడా సులువుగా చేధించబడతాయి. ఇదే కోవలో తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని కరణ్ కోట్ పోలీసులు ఓ గొర్రెల దొంగతనాన్ని చేధించారు.

వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ గొర్రెలను మేపుతున్నారు. ఈనెల 6వ తేదిన రాత్రి స్కార్పియోలో వచ్చిన దొంగలు అతని ఇంటి వద్ద ఉన్న పాకలో ఉన్న 6 గొర్రెలను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు కరణ్ కోట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన మార్గాలను అన్వేషించారు. ఈ క్రమంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్ మీదుగా ధారూర్, వికారాబాద్, మన్నెగూడ, చేవేళ్ల, మొయినాబాద్, నార్సంగి, లంగర్ హౌస్, హుమాయూన్ నగర్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టా, నాంపల్లి పోలీస్టేషన్ పరిధిలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. నిందితులను గుర్తించేందుకు ఈ 13 పోలీస్టేషన్లలో సుమారు 80 సీసీ కెమెరాలను పరిశీలించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించి అట్టి స్కార్పియో(OR 02AG1007) గుర్తించారు.
మరింత లోతుగా విచారించగా ఒరిస్సా ప్రాంతానికి చెందిన బాబులి, దీపు తమీమ్, సాజిద్, ముస్తఫాలు గ్యాంగ్‌గా ఏర్పడి హైదారాబాద్ బొరబండలో మఖాం వేసుకుని పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. విచారణలో తమీమ్, సాజిద్, ముస్తఫాలను ఎస్ఐ విఠల్ రెడ్డి, బృందం అదుపులోకి తీసుకుని చోరీకి ఉపయోగించిన స్కార్పియోను స్వాదీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద నుంచి చోరీ చేసిన 6 గొర్రెలలో 4 గొర్రెలను కూడా స్వాదీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా నిందితులు పరారిలో ఉన్నట్లు తెలిపారు. కేసు చేధించేందుకు 13 పోలీస్టేషన్లు, 80 సీసీ కెమరాలు, 120 కిలో మీటర్లు ప్రయాణించి నిందితులను పట్టుకునేందుకు శ్రమించిన ఎస్ఐ విఠల్ రెడ్డి, అతని బృందం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ మహేష్ తదితరులను అభినందించారు. చివరగా విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పది రోజుల క్రితమే గుర్తించినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి…

