ఇంట్లో నుంచే ఆస్తిపన్నులు…!
– చెల్లింపుకు ప్రత్యేక సదుపాయం
– ఎలా చేయొచ్చో తెలుసుకోండి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంకా రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఆస్తిపన్నుల కోసం అధికారులు, సిబ్బంది వసూళ్లబాట పట్టారు. అధికారులు వచ్చినప్పుడు యజమానులు ఇంటి వద్ద లేకపోవడవో.. అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాలతో అధికారులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. వారు వచ్చిన సమయంలో యజమానులు కూడా చెల్లింపులు చేయక ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి ఇబ్బందలుకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.సెల్ ఫోన్ నుంచే ఆస్తిపన్నులు చెల్లించేలా పురపాలిక శాఖ ప్రత్యేక వాట్సాప్ నంబరును ప్రకటిచింది. దీని ద్వారా ఇంట్లో నుంచి క్షణాల్లో బకాయిలు చెల్లించే అవకాశం దక్కింది. దీనిపై సరైన అవగాహన లేక ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ప్రస్తుతం అధికారులు ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాలని దృష్టిసారిస్తున్నారు.
నమోదు ఇలా..
పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 90002-53342 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని వాట్సాప్‌నకు అనుసంధానం చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా హాయ్ అని సందేశం పంపగానే అని వివరాలు ప్రత్యక్షమవుతాయి. తర్వాత భాషను ఎంపిక చేసుకోగానే మరో సందేశం వస్తుంది.అనంతరం పన్ను వివరాలు తెలుసుకునేందుకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఆస్తి పన్ను సంఖ్య (పీటీఐఎన్), ఇంటి నంబరు వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంటర్ చేసి సందేశం పంపితే రాష్ట్రంలోని 141 పుర, నగరపాలిక సంస్థల వివరాలు ప్రత్యక్షమవుతాయి. 1-141 అంకెల్లో మీరుండే పట్టణం ఏ సంఖ్యలో ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తవగానే పట్టణం, నగరం పేరును సూచిస్తూ మరో సందేశం వస్తుంది. ఇంటి నంబరును నమోదు చేస్తే పన్ను వివరాలన్నీ వస్తాయి. అక్కడ చూపించే పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే నెట్ బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, వాలెట్ ద్వారా మిగతా ఆన్లైన్ సర్వీసులను చూపిస్తుంది. వీటిలో ఏదైనా ఆప్షన్ ఎంపిక చేసుకొని చెల్లించవచ్చు.వాట్సాప్ చాట్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా, సందేహాలు ఉన్నా 9140-23120410 నంబరుకు ఫోన్ చేయవచ్చు. హెచ్‌టీటీపీఎస్://సీడీఎంఏ.సీజీజీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లోనూ వివరాలు పొందవచ్చు.

90శాతం వడ్డీ రాయితీ కూడా
ప్రస్తుతం మున్సిపల్లో ఒన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్) స్కీం నడుస్తోంది. యజమానులు తమ ఇంటిపై పాత బకాయిలు చెల్లించక పోవడంతో ప్రస్తుత డిమాండ్‌తో పాటు పాత బకాయిలపై వడ్డీ పేరుకుపోతోంది. మద్యతరగతి, పేద కుటుంబాలు వడ్డీతో సహ చెల్లించాలంటే ఆర్థిక భారం ఎదుర్కోక తప్పదు. ఈక్రమంలో మున్సిపల్ శాఖ ఓటీఎస్ విధానంను ప్రవేశ పెట్టింది. ఈ విధానంతో ఆస్తిపన్నుల వడ్డీపై 90శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ విధానం పేదలకు ఊరట కలిగించేదే. యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదికూడా చదవండి…

