క్యాన్సర్ పై అశ్రద్ధ చేయొద్దు..!
– దుర అలవాట్లే వ్యాధికి కారణాలు
– ముందస్తు చికిత్సతోనే రక్షణ
– క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. సీఎన్ శ్రీకాంత్
– ఐఎంఏ, యువజాగృతి అవగాహన సదస్సుకు స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మారుతున్న జీవన శైలి, దుర అలవాట్లే క్యాన్సర్ మహమ్మారికి కారకాలుగా నిలుస్తున్నాయని, ముందు జాగ్రత్తగా గుర్తిస్తేనే రక్షణ పొందవచ్చని హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. సీఎన్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షులు డా.జయప్రసాద్, యువజాగృతి తాండూరు అధ్యక్షులు పర్యాద రామకృష్ణల ఆధ్వర్యంలో పట్టణంలోని కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న ఎస్వీఆర్ గార్డెన్ లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈకార్యక్రమానికి ప్రముఖ స్పెషలిస్ట్ డా. సీఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యాధి సంక్రమించే విధానంపై అవగాహన కల్పించారు. కాలుష్యం, కల్తీ ఆహారం, వంశ పారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పోగాగు, గుట్కా వంటి దుర అలవాట్లు కూడా క్యాన్సర్ కు కారకాలుగా మారుతాయన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇతర చికిత్సల ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అదేవిధంగా ఐఎంఏ అధ్యక్షులు, డా.జయప్రసాద్ మాట్లాడుతూ శరీరంలో నొప్పి కలిగించని కణతుల పట్ల జాగ్రత్త వహించాలని, అవి క్యాన్సర్ కు కారణం కావచ్చని అన్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ అవగాహన లేక చాలా మంది క్యాన్సర్ గుర్తించకుండా వ్యాధిన బారిన పడుతున్నారని, వైద్యులు సూచించిన అంశాలతో అవగాహన పెంచుకుని జాగ్రత్త పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ ఐఎంఏ, యువజాగృతి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో యువజాగృతి సభ్యులు, వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

