కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు
– పదేళ్లు పాలించి ప్రజలను మోసం చేసింది
– తాండూరులో కారు ఉనికి ఖతం అయ్యింది
– మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలనతో పేదల అభివృద్ధికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో కోల్పోయిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలలు ఓ సంయుక్త ప్రకటనలో విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్బావం సందర్భంగా వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాఫ్‌గా మారిందన్నారు. పదేళ్లు పాలించి ప్రజలను మోసం చేసిన విషయం గుర్తించిన ప్రజలు సభకు వెళ్లేందుకు అయిష్టతను తెలిపారని అన్నారు. అయినా ఉనికి కోసం ప్రజలకు, కార్యకర్తలకు డబ్బుల ఆశ చూపించి సభకు తరలించారని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయిందన్నారు. ఒకప్పుడు సభ అంటే ఊరికో బస్సు పంపిన నాయకులు, ఇప్పుడు మూడు, నాలుగు గ్రామాలకు ఓ బస్సు కేటాయించి కార్యకర్తలను తరలించడం విడ్డూరంగా మారిందన్నారు. అయినప్పటికి ప్రజలు, కార్యకర్తలు సభ వద్దకు వెళ్లకుండానే వెనుదిరిగి వచ్చారని అన్నారు. రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రసంగం చేశారని అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ సంపదను దోచుకుని, అక్రమాలు, అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజా పాలన చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రజలు మద్దతు చెబుతున్నారని, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి జై కొడుతున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి….

