వరి ధాన్యానికి వాన దెబ్బ..!
– తడిసి మొలకెత్తిన ధాన్యం బస్తాలు
– ఆగమాగం అవుతున్న రైతులు
– ఆదుకోవాలని వేడుకుంటున్న వైనం
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగమాగం అవుతున్నారు. బషీరాబాద్ మండలంలో రైతులకు చెందిన ధాన్యం బస్తాలకు వర్షం వల్ల గట్టి దెబ్బ తగిలినట్లు అయ్యింది. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్థానిక రైతులు పెద్ద ఎత్తున ధాన్యం బస్తాలను నిల్వ ఉంచుకున్నారు.

వర్షాలు రాకుండా ఉంటే ఆరబెట్టుకునేందుకు ఇక్కడ నిల్వ ఉంచుకున్నారు. అయితే రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నిల్వ ఉంచిన చోటే ధాన్యం బస్తాలు తడిసి పోయారు. దీంతో రైతులకు చెందిన ధాన్యం బస్తాలు తడిసి బస్తాల నుంచే ధాన్యం గింజలు మొలకెత్తాయి. నిల్వ ఉంచుకున్న ధాన్యం బస్తాలు తడిసి పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. ధాన్యం బస్తాలను వేరే ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు తడిసిన ధాన్యం బస్తాలు కొనే పరిస్థితి లేకపోవడంతో మనోవేధనకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం బస్తాలు వర్షార్పణం కావడంతో ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం బస్తాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

