అట్టహసంగా జీఏంకే డబ్ల్యూపీఎల్ ముగింపు
– రాష్ట్రస్థాయి సీజన్-1 ట్రోఫీ గెలుచుకున్న ఆల్పూర్ ఖాన్ టీం
– భారత మాజీ కెప్టెన్ అజారోద్దీన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల అందజేత
– రన్నర్ జట్టుకు కూడా ట్రోఫీ, నగదు బహుకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన వ్యాపార వేత్త, జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన విలియమూన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది.

గత నెల 28న తాండూరు పట్టణంలోని విలియమూన్ మైదానంలో విలియమూన్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ముగింపు సమావేశానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజారోద్దీన్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. దాదాపు 18 రోజులుగా సుమారు 40 జట్లతో జరిగిన పోటీలలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో ఆల్పూర్ ఖాన్(తాండూరు) జట్టు, జీఏంకే జట్టులు పోటీలు పోటీ పడగా 83 పరుగులతో ఆల్పూర్ ఖాన్ జట్టు విజయం సాధించింది. జీఎంకే జట్టు రన్నర్ గా నిలిచింది. ఈ పోటీలో విజేత జట్టుకు ట్రోపీతో రూ. 50వేల నగదు, రన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 25 వేల నగదును అజారోద్దీన్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా అజారోద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో డబ్ల్యూపీఎల్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత పోటీలు పడి ఫైనల్ కు చేరుకోవడం, ట్రోఫీ, నగదును గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాండూరులో క్రికెట్ క్రీడకారుల కోసం మంచి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరారు. యువత క్రీడల్లో నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు. గ్రామీణం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, జాతీయం, అంతర్జాతీయ స్థాయిలలో రాణించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందస్తామన్నారు. తాండూరులో క్రికెట్ క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే మంజూ రైనా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లో క్రీడలకు ప్రాధాన్యమిచ్చే విధంగా దృష్టిసారిస్తున్నామన్నారు. తాండూరులో డబ్ల్యపీఎల్ టోర్నమెంట్ ను విజయవంతంగా పూర్తి చేసినవారందరికి అభినందనలు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా. సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సర్దార్ ఖాన్, టోర్నమెంట్ నిర్వహకులు, రాజకీయ నేతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

