దళిత బంధుకు మళ్లీ రూ. 250 కోట్లు..!
– నిధులు విడుదల చేసిన కేసీఆర్ సర్కార్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక దళితబంధు పథకానికి మళ్లీ నిధులు విడుదల చేసింది. హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ ఓడిన తర్వాత దళిత బందు పథకాన్ని అమలు చేయదని పలువురు ప్రతి పక్ష నేతలు ఆరోపించారు. అయితే దళిత బందు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌తో పాటు చింతకాని, తిరుమల గిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాలను దళిత బందు పథకానికి అమలుకు ఎంచుకున్నారు. ఈ నాలుగు మండలాల్లో దళిత బందు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిధులను విడుదల చేసింది. రూ.250 కోట్లతో ఈ నాలుగు మండలలో దళిత బందు పథకాన్ని అమలు చేయనున్నారు. చింతకాని మండలానికి రూ.100 కోట్లు కేటాయించారు. మిగిలిన మూడు మండలాలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఇప్పటికే ఈ నాలుగు మండలాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు అర్హులను గుర్తించారు. దళిత బందు పథకంతో ఇప్పటికే హుజురాబాద్ లో కొందరు లబ్ధిపొందారు.
