కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం నీచం
– రైతులను మోసం చేసేందుకే మహాదర్నా
– బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయడం నీచమైన పని అని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిర్వహించిన రైతు మహాదర్నాలో కేంద్ర ప్రధాన మంత్రి మోడి, అమిత్‌షా, మంత్రి కిషన్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఆమె శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి బొమ్మను దహనం చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు నీచమైన పనికి పూనుకున్నారని మండిపడ్డారు. మోడి దేశం కోసం చేస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని, ఇందులో చాలా వ్యత్యాసం ఉందన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన దర్నా అర్దరహితమన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులను మభ్య పెట్టేందుకు దర్నా చేపట్టారని విమర్శించారు. ఈ దర్నాలో రైతులు ఎవ్వరు పాల్గొనలేదన్నారు. కేవలం నాయకులు, అద్దె కూలీలు మాత్రమే పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత కుట్రలను రైతులు, ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ది చెప్తారని పేర్కొన్నారు.


