బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు
– రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1179 ఓటర్లు
– రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్
ఉమ్మడి రంగారెడ్డి, దర్శిని ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయని, ఎన్నికలకు సంబంధించి రేపు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 16 నుండి 23 వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. పని రోజులలో మాత్రమే నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగదని స్పష్టం చేశారు. 24 న పరిశీలన, 26 లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 10 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగు ఉంటుందన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1179 ఓటర్లు ఉన్నారని, ఇందులో స్త్రీలు 627, పురుషులు 552 ఉన్నారన్నారని వెల్లడించారు. పోలింగ్ కొరకు రాజేంద్ర నగర్, తాండూరు, వికారాబాద్, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహింపట్నం, కందుకూరు, చేవేళ్ల లో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, బ్యాలెట్ పేపర్ ఆధారంగా పోలింగ్ జరుగుతుందని తెలిపారు. శాసన మండలి ఎన్నికకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల ప్రాదేశిక సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు..కార్పొరేటర్లు ఓటర్లుగా ఉంటారని 1179 ఓటర్లు గల ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. జాబితా పై ఈ నెల 20 వరకు క్లైమ్స్ స్వీకరిస్తామని, 21,22 తేదీలలో స్క్రూటినీ చేసి 23 న తుది జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.