తాండూరులో అఘాయిత్యాలు, అక్రమాలు
– కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు
– సీఎం నియోజకవర్గానికి ఇంటిగ్రేటేడ్ స్కూల్..?
– స్పందించాలంటూ ఎమ్మెల్యేకు లేఖ
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోజు రోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరగడంతో పాటు ఇసుక, ఎర్రమట్టి రవాణాలు అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని, తాండూరుకు రావాల్సిన ఇంటిగ్రేటేడ్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి తరలించుకుపోయారని ఆవేధన చెందారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలని లేఖ రాసినట్లు రాజుగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, యాలాల మండలం, బషీరాబాద్ మండలాల్లో మైనర్ బాలికలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడడంతో 4 ఫోక్సో కేసులు నమోదు కావడం కలవరంకు గురిచేస్తుందని అన్నారు.

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షానికి ధాన్యం తడిసి, ఎండకు ఎండిపోతున్నాయని, తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. ఎర్రమట్టిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు యధేచ్చగా తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం విఫలం అయ్యారని విమర్శించారు.

తాండూరుకు మంజూరైన సమీకృత పాఠశాల(ఇంటిగ్రేటేడ్ స్కూల్) శిలా ఫలకలం వేసిన తరువాత దానిని సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి తరలించినట్లు తెలుస్తోందని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలని కోరారు. ఈ విషయాలపై స్పందించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఫోక్సో కేసుల విషయంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక, ఎర్రమట్టి రవాణాపై కట్టడి చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జిల్లా కలెక్టర్‌కు బాధ్యత అప్పగించి పార్టీలకు అతీతంగా నిరుపేద అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


