బల్దియా బద్దకం..!
– పొద్దెక్కిన వెలుగుతున్న వీధి దీపాలు
– నియంత్రణలో సిబ్బంది నిర్లక్ష్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బల్దియాలో సిబ్బందికి బద్దకం పెరిగిపోతోంది. పట్టణంలో పొద్దేక్కే వరకు వీధి దీపాలు వెలుగుతున్న బంద్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

శనివారం తాండూరు పట్టణంలో ఉదయం దాటినా వీధి దీపాలు వెలుగుతూ ఉన్న దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల – బసవణ్ణ కట్ట మార్గంలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు మున్సిపల్ నిర్వహణలో కొనసాగుతున్నాయి.

మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ రాత్రి వెలిగేలా, ఉదయం సూర్యోదయంకు ముందు బంద్ చేసేలా విధులు నిర్వహిస్తారు. అయితే శనివారం ఉదయం 8 గంటలు దాటినా కూడా విద్యుత్ దీపాలు వెలుగుతూ కనిపించాయి. పగలు విస్తరించినా వృథా వెలుగులు కనిపించడంతో పలువురు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై అట్లుంటది మున్సిపల్ పనితీరు అన్నట్లుగా పెదవి విరుపు విమర్శలు చేశారు.

పట్టణంలో ఓ వైపు వీధి దీపాలు వెలగక చీకట్లు కమ్ముకుంటే.. ఇక్కడ మాత్రం పగలే వెలుగులు విరజిమ్ముతున్నాయని మాట్లాడుకున్నారు. మున్సిపల్ ఇలాఖాలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అంటూ చర్చించుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


