జోహార్.. జై భీమ్..!
– తాండూరులో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
– నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– వర్ధంతిలో పాల్గొన్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : జోహార్.. అంబేద్కర్, జై భీమ్ బాబా సాహెబ్ అనే నినాదాలు తాండూరులో మార్మోగాయి. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్. అంబేద్కర్ 66వ వర్ధంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనియర్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు కూడ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, నేతలతో కలిసి అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. అదేవిధంగా జై భీమ్ ఎడ్యూకేషన్ పీపుల్స్ సంఘం ఆధ్వర్యంలో సభ్యులు కోసి విజయ్ కుమార్, ఎల్లప్ప, వీరేశం, శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, నరేష్, రాజు, వికాష్, జుంటుపల్లి వెంకట్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్, పోలీస్టేషన్, మార్కెట్ కమిటి తదితర కార్యాలయాలలో అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రజా స్వామ్యంలో అందరికి స్వేచ్ఛ.. హక్కులను కల్పించిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.

