క‌క్ష్య పెంచుకుని కారుతో గుద్దేశారు..!

క్రైం తాండూరు వికారాబాద్

క‌క్ష్య పెంచుకుని కారుతో గుద్దేశారు..!
– వ్యాపారానికి అడ్డు వ‌స్తున్నార‌ని ఘాతుకం
– ఆర్జీకే కాల‌నీ ప్ర‌మాదంలో నిందితుల రిమాండ్
– వివ‌రాలు వెల్ల‌డించిన రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: చేసేదే అక్ర‌మ వ్యాపారం.. అందులో అడ్డువ‌స్తున్నార‌ని కారుతో గుద్ది ఒక‌రి మృతికి, ఇద్ద‌రిని గాయాల‌పాలు చేసిన నిందితుల‌ను తాండూరు రూర‌ల్ పోలీసులు క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. ఈనెల 13న శ‌నివారం అర్ద‌రాత్రి దాటిన త‌రువాత తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డుమార్గంలోని రాజీవ్, ఇందిర‌మ్మ కాల‌నీ స‌మీపంలో బైకు ఢీకొన్న ప్ర‌మాదంలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించగా, మ‌రో ఇద్ద‌రు గాయాలతో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే. మొద‌టి నుంచి ఈ ప్ర‌మాదంపై బిన్న‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గాయ‌ప‌డిన బాధితుల్లో ఒక‌రి ఫిర్యాదు
మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు ప్ర‌మాదాన్ని హ‌త్యాయ‌త్నంగా గుర్తించి నిందితుల‌ను రిమాండుకు త‌ర‌లించారు. ఈ కేసుకు సంబంధించి మంగ‌ళ‌వారం తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డి పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రాజీవ్ కాల‌నీకి చెందిన షేక్ ఇస్మాయిల్(21) తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరుకు చెందిన అబ్దుల్ మోహి(21)తో క‌లిసి గ‌త కొంత కాలంగా అక్ర‌మ రేష‌న్ బియ్యం దందా న‌డిపిస్తున్నారు.
ఈ విష‌యంలో రాజీవ్ కాల‌నీకి చెందిన అబు సుఫీయాన్‌తో గొడ‌వలు జ‌రుగుతున్నాయి. ఈక్ర‌మంలో ఈనెల 10న పెద్దేముల్ మండ‌ల ప‌రిధిలో ఇస్మాయిల్, మోహిల‌కు చెందిన అక్ర‌మ రేష‌న్ బియ్యం త‌రలిస్తున్న వాహ‌నం పట్టుబ‌డింది. ఈ స‌మాచారాన్ని సుఫీయాన్ అందించి ఉంటాడ‌ని వారు అతనితో గొడ‌వ‌ప‌డి క‌క్ష్య పెంచుకున్నారు. ఈనెల 13న రాజీవ్ కాల‌నీకి చెందిన అమాన్ పాష‌కు చెందిన కారులో షేక్ ఇస్మాయిల్, మోహి తాండూరుకు వ‌చ్చారు. ప‌ట్ట‌ణంలోని అప్స‌న్ టీస్టాల్ వ‌ద్ద అబు సుఫీయాన్ అత‌ని స్నేహితులు జ‌బ్బార్, సోహెల్‌లు క‌నిపించారు. వారు తిరిగి కాల‌నీకి వెళుతున్న క్ర‌మంలో కారులో ఉన్న షేక్ ఇస్మాయిల్, మోహిలు వారికి ఎలాగైనా గుద్ది చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాల‌నీ స‌మీపంలోకి వెళ్ల‌గారు ముందు వెళుతున్న బైకును ఢీకొట్టి రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీకరించేప్ర‌య‌త్నం చేశారు. కారు బైకును ఢీకొట్టిన వెంట‌నే బైకుపై ఉన్న జబ్బార్ ఎగిరిప‌డి తీవ్ర‌గాయాల‌తో మృతిచెందాడు. సుఫీయాన్ స్వ‌ల్ప గాయాల‌తో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోగా సోహెల్‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే నిందితులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. బాధితుడు సుఫీయాన్ ఫిర్యాదు మేర‌కు యాలాల
పోలీస్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. తాండూరు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో యాలాల ఎస్ఐ సురేష్ ద‌ర్యాప్తు జ‌రిపారు. బ‌షీరాబాద్ మండ‌లం ఎక్మాయి గ్రామంలో త‌ల‌దాచుకున్న నిందితులు మంగ‌ళ‌వారం బ‌షీరాబాద్ రైల్వే స్టేష‌న్‌లో రైలు ఎక్కి ప‌రార‌య్యేందుకు య‌త్నిస్తుండ‌గా స‌మాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులు నేరాన్ని అంగీక‌రించ‌డంతో వారిపై కేసు న‌మోదు చేసి కోర్టులో హ‌జ‌రు ప‌రిచిన త‌రువాత రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు రూర‌ల్ సీఐ జ‌లంధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. నిందితుల నుంచి ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారుతో పాటు ఓ వివో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.