లోకల్ బాడీ జాబితా ఫైనల్
– 12 మందిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
– మహేందరెడ్డి, శంబీపూర్ రాజులకు రెన్యూవల్
– 23న నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: స్థానిక సంస్థల(లోకల్ బాడీ) ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 స్థానాల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సీటు, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఆయా స్థానాలల ఎంపికలో మొదటి నుంచి ఊహించని ట్విస్టులు ఎదురైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆదిలాబాద్ – దండే విఠల్, ఖమ్మం – తాత మధు, మహబూబ్‌నగర్ – సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి – శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ – ఎంసీ కోటిరెడ్డి, మెదక్ – డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్ – ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే.. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఉమ్మడి రంగారెడ్డిలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజులకు రెన్యూవల్ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 23 నామినేషన్లను వేయబోతున్నారు. నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26 ఉపసంహరణకు చివరి తేదీ ఉండగా.. డిసెంబర్ 10 పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. డిసెంబర్ 14 కౌంటింగ్ జరగనుంది.

