ఆర్టీసీ బస్సు మృతులకు అంజలి..!
– తాండూరులో కొవ్వొత్తులతో నివాళులు
– పురవీధుల్లో ర్యాలీ, పాల్గొన్న పౌరులు
– తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తాండూరు పౌరులు అంజలి ఘటించారు. బుధవారం సాయంత్రం తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలి నిర్వహించారు.

మూడు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బస్పు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా, ఖాలిద్, రెండు నెలల చిన్నారి, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, వాల్మీకీనగర్ కు చెందిన వెంకటమ్మ, పాత తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబ, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిల రెడ్డి, పెర్కంపల్లికి చెందిన తనూషా, సాయిప్రియ, నందిని, హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యా భర్తలు లక్ష్మీ, బందెప్పలతో మొత్తం 13 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

ఈ దుర్ఘటనపై దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పౌరులు, వాలంటీర్లు, సామాజిక సేవా సంస్థలు, విద్యార్థులు సహా అనేక మంది ర్యాలీలో పాల్గొని మృతులకు నివాళులర్పించారు. అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి చెందిన 13 మంది దుర్మరణం చెందడం విషాదకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మానవీయ నష్టం మరల జరగకుండా ప్రభుత్వాలు, పాలకులు నిరోధక చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలి, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చూడాలని కోరారు.

ఇదికూడా చదవండి…

