అక్రమ రవాణాపై కన్నెర్ర..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

అక్రమ రవాణాపై కన్నెర్ర..!
– ఎర్రమట్టి, ఇసుక తరలింపుకు కళ్లెం
– జిల్లా ఎస్పీ ఆదేశాలతో మెరుపు దాడులు
– నాలుగు రోజుల్లో 10 వాహనాలు సీజ్
– వికారాబాద్‌ జిల్లాలో ఎస్పీ స్నేహా మెహ్రా మార్క్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో గత కొన్ని రోజులుగా రెచ్చిపోతున్న అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతోంది. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన స్నేహా మెహ్రా తన మార్క్‌ను చూపిస్తూ అక్రమ రవాణా, అసాంఘీక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దం అయ్యారు. ఇందులో భాగంగా జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అక్రమార్కులపై సీరీయస్‌ చర్యలు తీసుకున్నారు. ఇటీవల జిల్లాలో టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో ఏక కాలంలో ఇసుక, ఎర్రమట్టి రవాణాపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

నాలుగు రోజుల్లో జరిపిన దాడుల్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామంలో అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలు, ఒక జేసీబీ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇసుక ట్రాక్టర్‌ను, యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రరాయిని తరలిస్తున్న లారీని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకొని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో బాధ్యులైన డ్రైవరుల,యజమానులపైనా చట్టపరమైన కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర గారు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఎవరైనా ఎక్కడైనా అక్రమ తరలింపులు జరిగిన, అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వెంటనే జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాలో వచ్చిరాగానే ఎస్పీ డేరింగ్ చర్యలు తీసుకోవడంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అక్రమార్కులకు దఢ పుట్టినంత పని అవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇదికూడా చదవండి…

వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!