పక్కచూపుల పుర పోరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పక్కచూపుల పుర పోరు..!
– పార్టీలలో కౌన్సిలర్‌ల అభ్యర్థుల వేట
– బలమైన నాయకుడికి గాలాలు
– మరో పార్టీలోకి వెళుతున్న టిక్కెట్టు దక్కని ఆశావాహులు
– రసదాయకంగా తాండూరు రాజకీయాలు
– ఏ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా…?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ వైపు మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలలో పరిణామాలు రోజుకోరకంగా మారుతున్నాయి. రిజర్వేషన్ల ప్రకటన తరువాత అన్ని పార్టీల అభ్యర్థులు పోటీకి సమాయత్తం అవుతున్నారు. ఇదే క్రమంలో ఆయా పార్టీల పెద్దలు అభ్యర్థుల వేటను ప్రారంభించారు. ఏయే పార్టీలో ఎవరు గెలుపు గుర్రాలో అని వడపోతను ప్రారంభించారు.

తాండూరు మున్సిపల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మద్య పోరు జరుగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా పార్టీల నేతలు మున్సిపల్ పీఠంను కైవసం చేసుకునేందుకు గురి పెట్టారు. మెజార్టీ స్థానాల్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఏయే స్థానాలలో బలంగా ఉన్నారు.. అనే విషయాలను కాంగ్రెస్ పార్టీ బలంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ అభ్యర్థులపై కూడా కన్నేసింది. హస్తం పార్టీలో గెలిచే అభ్యర్థులను మినహాయించి.. మిగతా వార్డులలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సాయిపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ యువనాయకుడుని పార్టీలోకి చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బీజేపీ పార్టీలోని సీతారాంపేట్ ప్రాంతానికి చెందిన మరో యువనాయకుడును కూడా పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా హస్తం పార్టీలో గెలిచే సత్తా నాయకుడికి పక్కన పెట్టడడంతో ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్ పరిమళ గులాబీ గూటికి చేరారు. ఆమెతో పాటు పాత తాండూరు మాణిక్‌ నగర్‌ మాజీ కౌన్సిలర్ బొంబీనా కూడా బీఆర్ఎస్‌లో చేరారు. ఇంకా మరికొందరు బీఆర్ఎస్‌ పార్టీలోకి పలువురు వచ్చే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. బీజేపీలో ఇతర పార్టీల నేతలు చేరే పరిణామాలు కనిపించడం లేదు. దీంతో అదే పార్టీలో కొత్త వారిని బరిలో నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి…

శ్రీరామ మందిరానికి విరాళం..!