వైభవంగా మహా శివరాత్రి..!
– శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
– దేవాలయాలలో శివయ్యకు అభిషేకాలు
– భూకైలాస్కు పోటెత్తిన భక్తులు
– నీటిగుండం ద్వారా భక్తుల దర్శనం
– శంకర్ నాయక్, వాసు నాయక్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం వేడుకలను తాండూరు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. శివరాత్రి సందర్భంగా పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయం, కోటేశ్వర దేవాలయం, అంతప్పబావి శివాలయం, చెరువెంటి ఈశ్వరాలయం తదితర శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.

పండుగను పురస్కరించుకుని కుటుంబంలోని చిన్నా, పెద్ద అంతా తరలివచ్చి ఆలయాల్లో వెలసిన శివుని, శివలింగానికి, నందీశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను సమర్పించుకున్నారు. అదేవిధంగా ఆలయాల్లోని శివలింగాలు అభిషేకాలతో తడిసి ముద్దయ్యాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని శివున్ని దర్శించుకునేందుకు ఆలయాలకు వేలాధిగా భక్తులు తరలిరావడంతో ఆలయాన్ని కిట కిటలాడాయి. మరోవైపు శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు సాయంత్రం వేళ శివున్ని దర్శించుకుని ఫలహారాలు తీసుకుని దీక్షలను విరమించారు.

భూకైలాస్కు పోటెత్తిన భక్తులు
మరోవైపు తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానంకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దేవాలయ వ్యవస్థాపకులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర్ నాయక్ పవార్, వాసు నాయక్ పవార్ల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండగా నిర్వహించారు. మహా శివరాత్రి సందర్బంగా దేవాలయంలో ప్రసిద్ది గాంచిన నీటి గుండం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవాలయానికి వచ్చిన భక్తులు నీటిగుండం ద్వారా శివలింగాలకు అభిషేకాలు చేస్తూ దేవాలయంలోని మహా శివున్ని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో వెలసిన పలు దేవతామూర్తులను దర్శించుకుని సల్లంగా చూడూ శివయ్య అంటూ వేడుకున్నారు. మరోవైపు శంకర్ నాయక్ పవార్, వాసు నాయక్ పవార్ల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భూకైలాస్లో జరిగిన బ్రహ్మోత్సవాలకు తాండూరుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్, మహబూబ్నగర్, ఇతర జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో భూకైలాస్లో బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది.


