మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి

తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్

మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి
– ఎమ్మెల్యే సహాకారంతో ఆసుపత్రుల్లో సదుపాయాలు
– వైద్య పోస్టుల భర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి
– జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిల సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలలో రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు.

సోమవారం పట్టణంలోని జిల్లా ఆసుపత్రితో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలను ఆమె సందర్శించారు. జిల్లా ఆసుపత్రిలో పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందిస్తున్న సేవలను మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మాతా శిశు ఆసుపత్రిని కూడా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో చిన్నారులకు, గర్భిణి, బాలింతలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు.

ఆసుపత్రిలో ప్రతి రోజూ సాధారణ ప్రసవాలు, సీజిరియన్ ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా మెలగాలని విజ్ఞప్తి చేశారు. ఓపికతో సమస్యను తెలుసుకుని వైద్యం అందించాలన్నారు. ప్రసవాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం జరిగిన దూది మరిచి కుట్లు వేసిన సంఘటనపై బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులతో, బాలింతలతో మాట్లాడి ప్రసూతి సేవలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు కల్పించేలా దృష్టి సారిస్తామన్నారు. అదేవిధంగా వైద్య పోస్టులు, సిబ్బంది పోస్టులు భర్తి చేసేలా చూస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, ఆసుపత్రి వైద్యులు డా.శరత్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

తాండూరులో మరో ఫోక్సో కేసు