బుయ్యని ‘శ్రీనివాస్ రెడ్డి అడుగులు’ ఎటువైపు

తాండూరు రాజకీయం వికారాబాద్

బుయ్యని ‘శ్రీనివాస్ రెడ్డి అడుగులు’ ఎటువైపు
– ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో సుదీర్ఘ చర్చ
– అనుచరుల్లో నూతన ఉత్సాహం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంగా, సేవకు ప్రతిరూపంగా, తాండూరు ప్రజల మనిషిగా పేరొందిన ఆర్బివోఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో అన్నకు తోడుగా నిలవడంతో వార్ వన్ సైడ్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ గెలుపుకు కారణమయ్యారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగడంతో ఈ మధ్యకాలంలో పార్టీలో ఉత్సాహంగా కనిపించడం లేదు.

తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం అన్ని తానై… ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కావాలన్నదే లక్ష్యంగా అడుగులు వేశారు.

పార్టీలో వెన్నుపోటుదారులు ఉండడంతో అది సాధ్యం కాదని తెలిసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు పోటీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు సమాచారం. తన సొంత అన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి బిజెపి నేతలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.

శనివారం తాండూరులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారానికి వచ్చిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి రోడ్ల పనులకు శంకుస్థాపన కాగానే నేరుగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. బోజనము అనంతరం గంటకు పైగా వారి ఇంట్లో ఉండి వ్యాపారంతో పాటు రాజకీయ అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. తాండూరు, పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసేందుకు మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. మహిళా రిజర్వేషన్ వస్తే బుయ్యని శ్రీనివాస్ రెడ్డి భార్య బుయ్యని సరళ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సానుకూల వైఖరి తెలిపినట్లు తెలిసింది.

ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది మాత్రం స్పష్టత రాలేదు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి పార్టీకి చెందిన వారు కావడంతో బిజెపి నుంచి పోటీ చేస్తారా..? వారి సహకారంతో ఇతర రాజకీయ పార్టీల నుంచి చేస్తారా..? లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కలయిక తాండూరు నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు ఏ చిన్న పదవి కూడా రాకపోవడంతో ఆయన కాస్త బాధలో ఉన్నట్టు సమాచారం. మనోహర్ రెడ్డి గెలుపుకు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ప్రతిక్షణం సహకరించినప్పటికీ ఎన్నికల్లో వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడంతో పార్టీ మారే ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే కనుక నిజమైతే రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ఇబ్బంది పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్యకాలంలో పరిగి నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం ఉన్న గంటల తరబడి ఉంటూ రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేవీసీఎస్‌లో మాక్ ఎలక్షన్స్‌ జోష్‌