గిరిజన నిరుద్యోగులకు శుభవార్త
– స్వయం ఉపాధి కోసం ఉచిత శిక్షణ
– అన్ని మండలాల యువతకు అవకాశాలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి శుభవార్త చెప్పారు.

గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థిక స్వావలంబన సాధించేలా చేయడం లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ట్రైకోర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయం, బ్యూటీ & వెల్నెస్, అప్పారెల్, టూరిజం & హాస్పిటాలిటీ, టెలికాం, లాజిస్టిక్స్, ఐటీ & ఐటీఈఎస్, ఆటోమొబైల్ తదితర రంగాలలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,500 మంది నిరుద్యోగ గిరిజన యువతకు ఈ శిక్షణలను అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ శిక్షణలు జాతీయ నైపుణ్య అర్హతా చట్రం (NSQF) ప్రమాణాలకు అనుగుణంగా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థల ద్వారా నిర్వహించబడతాయని, శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అర్హులైన గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసక్తి గల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (DTDO), వికారాబాద్ కార్యాలయాన్ని సంప్రదించి తమ పేర్లను ఈ నెల 25.07.2026 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు, ఇతర వివరాలకు ఫోన్.నం.8464006666 ను సంప్రదిచగలరు.


