స్వచ్ఛత అందరి బాధ్యత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్వచ్ఛత అందరి బాధ్యత..!
– పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– పారిశుద్ధ్య నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 1 నుంచి 6వ వార్డుల్లో స్వచ్ఛత వారోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత కాదని, ప్రజలు కూడా భాగస్వాములై స్వచ్ఛతకు సహకరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ తాండూరు స్పెషల్ డ్రైవ్’లో భాగంగా మంగళవారం 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు.

ఈ సందర్భంగా వార్డుల్లోని మురుగు కాలువలు, చెత్త సేకరణ, రోడ్లు, వీధుల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పారిశుద్ధ్య సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్త సేకరణను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

దోమల నివారణకు ఫాగింగ్‌ నిర్వహించడంతో పాటు మురుగు కాలువల శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్‌లో చేపడుతున్న పనులు కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా కొనసాగాలని, పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

పట్టణ ప్రజలు కూడా తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ప్రజలు, మున్సిపాలిటీ సమన్వయంతో పనిచేసినప్పుడే స్వచ్ఛమైన తాండూరును నిర్మించగలమన్నారు.

సబ్‌ సెంటర్‌, అంగన్‌వాడీ పరిశీలన
వార్డుల పర్యటనలో భాగంగా సబ్‌ సెంటర్‌, అంగన్‌వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవలు, సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి, కమిషనర్‌ రాకేష్‌, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ రజాక్‌, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి