మానవత్వం చాటుకున్న జావిద్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మానవత్వం చాటుకున్న జావిద్..!
– తల్లీ, బిడ్డను కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం
– కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవం తరువాత మృతి చెందిన తల్లీ, బిడ్డా కుటుంబానికి తాండూరు 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన బాలమణి(25) బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చి.. అనంతరం తల్లీ, బిడ్డ ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ జావిద్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మద్దతుగా నిలిచారు. అదేవిధంగా గురువారం జిల్లా ఆసుపత్రి మార్చురి వద్ద కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. మృతురాలి అంత్యక్రియల ఖర్చుల కోసం తన సొంత నిధుల నుంచి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్‌ జావీద్‌ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి తల్లీ, బిడ్డను కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, తాండూరు ఎమ్మెల్యే తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, బాధ్యతారాహిత్యం నిర్ధారణ అయితే సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాళికాదేవి, నగరేశ్వర.. ఆలయాలకు కొత్త పాలక మండళ్లు..!