పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
– ఎస్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు కోరారు.

ఓటు నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఆన్లైన్లో లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇందుకు డిగ్రీ సర్టిఫికెట్ లేదా సమాన విద్యార్హత సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, ఫొటో, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రం తదితరాలను సమర్పించాలని తెలిపారు. గతంలో ఓటు ఉన్న పట్టభద్రులు కూడా తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టిందని పురుషోత్తంరావు పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించి పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రస్తుతం పట్టభద్రులు, నిరుద్యోగ యువత కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.


