విద్యార్థి దశను సద్వినియోగం చేసుకోవాలి
– చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి
– అట్టహాసంగా శాలివాహన డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో శాలివాహన డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేషాద్రి ముదేల్లి మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని అన్నారు. చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, మంచి విలువలతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగిన అనంతరం సమాజానికి తమ వంతు సేవ చేయాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ పి. శరత్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కళాశాల తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.

ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ఆటపాటలతో తులసి గార్డెన్ సందడిగా మారింది.

నూతన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కల్వ రాధాకృష్ణ, కరస్పాండెంట్ ఎం. మాణిక్యం, డైరెక్టర్లు కటకం వీరేందర్, బంటారం సుధాకర్, నాగారం మల్లేశం, రాధమ్మ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


