మార్మోగిన అయ్యప్ప నామస్మరణ..!
– వైభవంగా మణికంఠుని మహా పడిపూజ
– పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుక
– భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వామి శరణుఘోషతో తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగింది.

బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పడిపూజ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. మహా పడిపూజలో పైలెట్ రోహిత్ రెడ్డి, సతీమణి ఆర్తిరెడ్డి, తల్లి వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని పూజించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో పాటు అయ్యప్ప స్వాముల భజన కీర్తనల మద్య అయ్యప్ప స్వామికి రోహిత్ రెడ్డి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మెట్ల పూజ తదితర కార్యక్రమాలు కన్నుల పండుగలా జరిగాయి. పూజ అనంతరం పైలెట్ రోహిత్‌రెడ్డి కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వాములకు స్వయంగా సేవలందించారు. భక్తులను ఆత్మీయంగా పలకరిస్తూ మర్యాదలు చేశారు. అయ్యప్ప పడిపూజకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత వైభవంగా నిర్వహించిన మహా పడి పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆర్థికంగా బాగుండాలని శ్రీ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు ఈ వేడుకకు బీఆర్ఎస్ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు, పార్టీ సీనియర్, ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.


