ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల గోదాంలో అగ్ని ప్రమాదం
– షాక్ సర్కూట్ వల్ల చెలరేగిన మంటలు
– కాలిపోయిన ట్రాన్స్పార్మర్లు, అయిల్ డబ్బాలు
– మంటలను ఆర్పేసిన తాండూరు అగ్నిమాపక సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. తాండూరు పట్టణం కొత్త మున్సిపల్ భవనం సమీపంలోని హైదరాబాద్ రోడ్డు మార్గం విలియంమూన్ చౌరస్తా సమీపంలో విద్యుత్ ట్రాన్స్పార్మర్ మరమ్మత్తుల గోదాం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం గోదాంలో షాక్ సర్క్యూట్ సంభవించింది. దీంతో గోదాంలో మరమ్మత్తుల కోసం ఉంచిన దాదాపు 10 ట్రాన్స్ ఫార్మర్లతో పాటు అయిల్ డబ్బాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు విద్యుత్ ఉన్నతాధికారులతో పాటు తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తాండూరు ఫైర్ ఆఫీసర్ నాగార్జున తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గోదాంలోని ఓ గదిలో మరమ్మత్తుల ట్రాన్స్ఫార్మర్లు, అయిల్ డబ్బాలకు చెలరేగుతున్న మంటలపై నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు.
దీంతో పరిస్థితి అదుపులో కి వచ్చింది. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం జరిగిన గదిలో పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ఈ అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం వాటిల్లిందో అధికారులు అంచనా వేయలేకపోయారు. రేపు ఉన్నతాధికారులు విచారణ తరువాత ఎంత నష్టం జరిగిందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు.

