12లోను ప‌ది రాయోచ్చు..!

కెరీర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

12లోను ప‌ది రాయోచ్చు..!
– ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌కు వ‌య‌స్సు వెసులుబాటు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసే విద్యార్థుల ప‌ట్ల విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 12 ఏండ్లు నిండిన వారు కూడ ప‌రీక్ష రాసేందుకు వెసులుబాటును క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప‌దో త‌ర‌గ‌తి తుది ప‌రీక్షలు రాయాలంటే గ‌తంలో 14 ఏండ్లు త‌ప్ప‌నిస‌రిగా నిండాల‌నే నిబంధ‌న ఉండేది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో 12 ఏండ్లు నిండిన విద్యార్థి కూడ ప‌రీక్ష రాసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌వ‌ర్వుల‌ను కూడ జారీ చేసింది. ఇది ప‌దో త‌రగ‌తి చ‌దివే విద్యార్థుల‌కు శుభ‌వార్తే. ఫైన‌ల్ ప‌రీక్ష‌లు రాయాల‌నుకునే విద్యార్థులు కొన్ని నిబంధ‌న‌లు పూర్తి చేస్తే ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌చ్చు.

అందించాల్సిన దృవ‌ప‌త్రాలివే..
ఇప్ప‌టికే ఈ యేడాదిలో జ‌రిగే ఫైన‌ల్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఖ‌రారు చేసింది. వ‌చ్చే మార్చి 3వ తేదిలోగా ఫీజును చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఈ ప‌రీక్ష‌ల‌కు వ‌య‌స్సు మిన‌హాయింపు కోరే విద్యార్థులు కొన్ని నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు స‌మ‌యంలో విద్యార్థులు రూ. 300 చలనా కట్టి, మెడికల్ సర్టిఫికెట్‌, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రైవేట్ స్కూల్‌ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖాధికారి వయసు మినహాయింపు ఇచ్చే అధికారం కలిగి ఉంటారని ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు స్ప‌ష్టం చేశారు.

మరికొన్ని స‌దుపాయాలు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల వార్షికాదాయం రూ. 24 వేల లోపు ఉన్నట్లయితే పరీక్ష ఫీజులో రాయితీ పొందవచ్చు. ఇందుకోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

– డిస్‌ లెక్సియాతో సతమతమయ్యే విద్యార్థులు( మెదడు సంబంధిత సమస్యలుండి చదవడం, రాయడం, నేర్చుకోవడంలో ఇబ్బందిపడేవారు) మూడో భాష నుంచి మినహాయింపు పొందవచ్చు. వీరు పరీక్షల్లో స్క్రైబ్‌ (పరీక్షలో సహాయకుడిగా మరొకరిని) ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి విద్యార్థులకు ప్రతి పరీక్షా పేపర్‌కు 60 నిమిషాల అదనపు సమయం కేటాయించారు.

– మూగ, చెవుడు, అంధత్వం ఉన్న విద్యార్థులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వీరికి ఉత్తీర్ణత మార్కులు 35 నుంచి 20 మార్కులకు తగ్గించారు. స్క్రైబ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వీరు ప్రతి పేపర్‌కు 30 నిమిషాలు అదనంగా ఉపయోగించుకోవచ్చు.

– ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా నామినల్ రోల్స్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలి.