ఎజెండా రాజకీయాలు
– హోటల్ సమావేశంలోనే ఎజెండా ఆమోదం
– సంతకం లేని ఎజెండా సమావేశం తిరస్కరణ
– ప్రతిపక్షాలతో అధికారుల కుమ్మక్కు
– మీడియా సమావేశంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఎజెండా రాజకీయాలకు పాల్పడడం సమంజసం కాదని తాండూరు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ విమర్శించారు. శనివారం మున్సిపల్ భవనంలో జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమల్ తన కార్యాలయంలో ఫ్లోర్ లీడర్, పార్టీ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఇంచార్జ్ కమీనర్ అశోక్ కుమార్ తన సంతకం లేనిదే సమావేశంలో 48 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇందుకు ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆమోదం తెలపడం సమంజసం కాదన్నారు. సంతకం లేకుండా సమావేశం కొనసాగిడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్లో అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆధిపత్యం కోసం తనను దిగజార్చడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇందుకు వత్తాసు పలుకుతు అధికారులు రాజకీయాలకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని బల్లగుద్ది ప్రశ్నించారు. అధికారులు విధులను పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలని విమర్శించారు. ఓ ఉన్నతాధికారి చైర్ పర్సన్‌ను కలిసినా మెమోలు జారీ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా ప్రతిపక్ష కౌన్సిలర్లు కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లతో కలిసి అడుగడుగా అడ్డుకుంటున్నారని అన్నారు. శనివారం జరిగే ఎజెండాను అధికార పార్టీ పట్టణ అధ్యక్షుని సమక్షంలో ఓ హోటల్లో సమావేశం అయ్యి ఆమోదించడం వెనుక అంతర్యమేంటని అడిగారు. కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేయాలని ఇచ్చిన మెమోరెండంపై సరైన చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ శాఖ మంత్రి, సీడీఎంఏ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పబ్లిళ్ల రత్నమాలతో పాటు పలువురు మాట్లాడుతూ సంతకం లేని ఎజెండాను ప్రవేశ పెట్టడం చైర్ పర్సన్‌ను అవమాన పరచడమే అని అన్నారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఎజెండాను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు మూటగట్టుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మున్సిపల్‌కు వచ్చే నిధులను కేటాయించడం జరిగిందని, ఆయన ప్రత్యేకంగా నిధులు కేటాయించ లేదన్నారు. మున్సిపల్‌పై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, రాము, వెంకన్నగౌడ్, బోయరవి, సల్మా పాతిమా, కోఆప్షన్ సభ్యురాలు బిడ్కర్ ఉశ, మాజీ డీ పీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, టీఆర్ఎస్వై నాయకులు బిర్కడ్ రఘు, యువనాయకులు దత్తు. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

