ఇంటర్ కాలేజీలలో రేషనలైజేషన్..
– ప్రతిపాదనలు అందించనున్న విద్యాశాఖ
దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఇంటర్ కళాశాల రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. రాష్ట్ర విద్యాశాఖ నివేదిక మేరకు ప్ర్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే రేషనలైజేషన్‌పై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. 10కిపైగా కాలేజీల్లో వెయ్యి మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, 30కిపైగా కాలేజీల్లో 500 మందికిపైగా చేరారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీరికి ఆన్లైన్ తరగతు లు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తే, అధ్యాపకుల కొరత సమస్య తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, అధ్యాపకుల సంఖ్య అధికంగా ఉంటే వారిని బదిలీచేసి, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలని భావిస్తోంది. సిద్దం చేసిన ప్రతిపాదనలను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపి, అనుమతి వచ్చిన వెంటనే హేతుబద్ధీకరణ చేపట్టబోతున్నారు.

