మహిళ సంఘాల స‌భ్యుల‌కు శుభ‌వార్త

ఆరోగ్యం కెరీర్ తాండూరు వికారాబాద్

మహిళ సంఘాల స‌భ్యుల‌కు శుభ‌వార్త
– ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి రుణాలు
– ప్ర‌క‌టించిన స్త్రీనిధి జిల్లా రీజీన‌ల్ మేనేజ‌ర్ వేణు
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలోని మ‌హిళ సంఘాల సభ్యుల‌కు జిల్లా స్త్రీనిధి అధికారులు శుభ‌వార్త చెప్పారు. మహిళ సంఘాలలోని సభ్యులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు రుణాలు అందించడం జరుగుతుందని స్త్రీనిధి జిల్లా రీజినల్ మేనేజర్ వేణు తెలిపారు. సోమవారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సీసీ, వీఓఏలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయ‌న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహిల సంఘాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ వాహనాల కొనుగోలు కోసం ఒక్కోక్క‌రికి రూ. 75 వేల వరకు రుణాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా 22 నాటుకోళ్లకు కూడ రూ. 22 వేల రుణాలు అందజేస్తామని అన్నారు. ఈ రుణాలను మహిళ సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మ‌రోవైపు 2021-22 సంవత్సరానికి గాను స్త్రీనిధి ద్వారా రూ. 66.90 కోట్ల రుణాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 65 శాతం రూ. 45 కోట్ల రుణాలను ఇవ్వడం జరిగిందన్నారు. సంఘాలలో ఉన్న 10 మందికి రూ. 1లక్ష నుంచి 3 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని చెప్పారు.