విధులకు వెళుతున్న ఉపాధ్యాయుడిపై దాడి
– ఆగ్రహించిన ప్రజా సంఘాలు
– యాలాల పోలీస్టేషన్ వద్ద ఆందోళన
– దాడిచేసిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధులకు వెళుతున్న ఓ ఉపాధ్యాయుడిపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. టీచర్ పై దాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆగ్రహించి పోలీస్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. ఈ సంఘటన శుక్రవారం యాలాల మండలంలో చోటు చేసుకుంది. బాధిత ఉపాధ్యాయుడు, నాయకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం మల్లప్ప మడిగ ప్రాంతానికి కందుకూరి ప్రవీణ్ కుమార్ యాలాల మండలం అగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగా శుక్రవారం తన విధుల కోసం తాండూరు నుంచి అగ్గనూర్ కు బైకుపై బయల్దేరారు. లక్ష్మీనారాయణ పూర్ సమీపంలోని ఈసర్ పెట్రోల్ పంపు వద్దకు రాగానే వెనుకాలే కారు(టీఎస్34 డీ 1960)లో వస్తున్న అగనూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి వేగంగా ప్రవీణ్ వెళుతున్న బైకును ఢీకొట్టే విధంగా వెళ్లాడు. దీనిపై సక్రమంగా వెళ్లానని ప్రవీణ్ సూచించడంతో ఆగ్రహించిన రమేష్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. దౌర్జన్యంగా పిడిగుద్దులు గుద్దారు. దీనిపై ప్రవీణ్ కుమార్ యాలాల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ సంఘం, సీఐటీయూ, కేవీపీఎస్ తదితర ప్రజా సంఘాలతో పాటు కాంగ్రెస్ నాయకులు యాలాల పోలీస్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉపాధ్యాయుడు ప్రవీణ్ పై దాడి చేసిన వ్యక్తిని చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంపుతానని బెదిరించిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్, బీజేపీ నాయకులు రజనీకాంత్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య, బీసీ సంఘం బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, తాండూరు మండల అధ్యక్షులు బసంత్, పెద్దేముల్ మండల అధ్యక్షులు బాలు, బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, యువనాయకులు జుంటుపల్లి వెంకటేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

