కన్నుగప్పి కర్ణాటకకు..!
– దొంగతనంగా రేషన్ బియ్యం రవాణా
– 9క్వింటాళ్ల బియ్యం బొలేరో వాహనం పట్టివేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ వ్యాపారులు ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నారు. దీనిపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు గట్టి నిఘాను ఉంచి అక్రమ రవాణాకు కళ్లెం వేస్తున్నారు. తాజాగా అందరి కన్నుగప్పి గుట్టుగా కర్ణాటకు బియ్యాన్ని తరలిస్తున్న బొలేరో వాహనాన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో చోటు చేసుకుంది. దాదాపు 9 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో నీళ్లపల్లి మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా ఉంచిన పోలీసులు బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనంతో పాటు డ్రైవర్‌ను పట్టుకున్నారు. బియ్యం, వాహనాన్ని అదుపుకలోకి తీసుకుని బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు.

