ప్రతి సమస్యపై పరిష్కార బాణం ప్రజాబంధు
– అరచేతి నుంచే అధికారులందరికి ఫిర్యాదులు
– సమస్యలు లేని తాండూరు నిర్మాణమే లక్ష్యం
– ఈ సాకేంతిక విప్లవం ప్రజలకే అంకితం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ప్రజాబంధు యాప్ పరిష్కార బాణంగా పనిచేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అదునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్రజాబంధు యాప్‌ను అందరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆదివారం తాండూరులోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ప్రజాబంధు యాప్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరి పరిష్కారానికి భాద్యత వహించడంలో భాగంగా ప్రజాబంధు యాప్‌ను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన ఈ వ్యవస్థ తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తుందని వెల్లడించారు. ప్రతి పది గ్రామాలకు క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ కోఆర్డీనేటర్లు, మండల కోఆర్డీనేటర్లు, నియోజకవర్గ కోఆర్డీనేటర్లతో ప్రజాబంధు యాప్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడం జరుగుతుందని అన్నారు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారు అరచేతి నుంచే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టిని ఉంచి శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. తాండూరు నుంచి శ్రీకారం చుట్టిన ప్రజాబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశ పెట్టిన ప్రజాబంధును ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు.
రోడ్ల సమస్యలను తీరుస్తాం..!
అనంతరం కార్యక్రమానికి హాజరైన వివిధ గ్రామాల ప్రజలు రోడ్లు, విద్యుత్, వ్యవసాయం, మైన్స్ శాఖలకు సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు.

ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి తాండూరులో త్వరలోనే కొత్త మైనింగ్ పాలసీ ప్రారంభమవుతుందని, దీని ద్వారా గనుల లీజు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దీంతో పాటు తాండూరు నియోజకవర్గంలోని రోడ్ల పనులను వచ్చే యేడాది కల్ల పూర్తి చేసేందుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు. మున్సిపల్‌లో మిషన్ భగీరథతో ద్వంసమైన రోడ్లకు మరమ్మత్తులు చేయిస్తామన్నారు. వ్యవసాయ శాఖల అధికారుల సహాకారంతో రైతుల సమస్యలను, భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాప్ పర్యవేక్షకులు రాంప్రసాద్, శ్రీదర్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, నర్సిరెడ్డి, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, టీఆర్ఎస్ యువనాయకులు ఎం.శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ప్రవీణ్ పటేల్, చంటియాదవ్, మోయిజ్, వివిధ వర్తక, వ్యాపార, రాజకీయ, సంఘాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

