వైభోగంగా రుక్మిణీ, విఠల్ కళ్యాణం
– ఘనంగా శ్రీ పాండురంగా దేవాలయ వార్షికోత్సవం
– దర్శించుకున్న చైర్ పర్సన్, మాజీ చైర్ పర్సన్, కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ మల్‌రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని శ్రీ పాండురంగా స్వామి దేవాలయంలో కొలువుదీరిన శ్రీ రుక్మిణీ, విఠల్ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం పాండురంగా స్వామి దేవాలయ 27వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త మేడిశెట్టి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించిన రుక్మీణీ, విఠల్‌ల కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితులు సుమూహుర్తములో స్వామి వార్ల కళ్యాణాన్ని జరపించారు.

అంతకుముందు ఆలయంలో శ్రీ విష్ణు సహస్రనామ జపయజ్ఞాన్ని భక్తి ప్రపత్తులతో కొనసాగించారు. దేవాలయ వార్షికోత్సం, స్వామి వార్ల కళ్యాణాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, కౌన్సిలర్లు సాహు శ్రీలత, అంతారం లలితలు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. రుక్మిణీ విఠల్ సమేత స్వామి వార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ వార్షికోత్సవ వేడుకలలో పలువురు నేతలు, ప్రముఖులు ఆలయాన్ని సందర్శించి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగా దేవాలయ భక్త బృందం. గాయత్రి మహిళ భక్త బృందం. మల్ రెడ్డిపల్లి భజనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

