ఆయుధాల కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఊరట
– కేసు కొట్టేసినట్లు తీర్పునిచ్చిన న్యాయస్థానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆయుధాలు కలిగి ఉన్నట్లు తాండూరు పట్టణ పోలీస్టేషన్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నమోదైన కేసులో ఆయనకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లో ప్రజా ప్రతినిధుల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యక్తిగత ఆత్మరక్షణ కోసం ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించుకున్నారు. అప్పట్లో వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు తాండూరు పోలీస్టేషన్లో కేసు(77/2021) నమోదు అయ్యింది. ఈ కేసులో ఎమ్మెలే రోహిత్ రెడ్డి, రాజశేఖర్, రవీందర్లను దోషులుగా చేర్చారు. అయితే శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల కేసుల కోసం ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ఈ కేసులో న్యాయస్థానం ఎమ్మెల్యే రోహితి రెడ్డిని, మిగతా వారిని నిర్దోషులుగా ప్రకటించి కేసును కొట్టివేసింది. ఈ విషయాన్ని తాండూరు న్యాయవాది గోపాల్ వెల్లడించారు. మరోవైపు తనపై నమోదైన కేసులో నిర్దోషిగా తేలడంతో పాటు కేసు కొట్టి వేయడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

