వేలం వ‌రించేది ఎవ‌రికో..?

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

వేలం వ‌రించేది ఎవ‌రికో..?
– నేడు రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలం
– ఏర్పాట్లు చేసిన అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గం, యాలాల మండ‌లం కోక‌ట్ ప‌రిధిలోని రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలంపై అంద‌రి దృష్టి నెల‌కొంది. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి ప్లాట్ల బ‌హిరంగ వేలం నిర్వ‌హిస్తున్నారు. ఈ ప్లాట్ల వేలం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను పెంచుకునేందుకు తాండూరులోని రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌ను వేలం వేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో తాండూరులోని రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల‌ను వేలం వేస్తున్నారు. తాండూరులో మ‌నోహ టౌన్‌షిఫ్ ఆధ్వ‌ర్యంలో గ‌త కాంగ్రెస్ హ‌యంలో రాజీవ్ స్వ‌గృహ ప‌థ‌కం కింద మొత్తం 173 ప్లాట్ల‌ను నిర్మించ‌గా గ‌తంలో 101 ప్లాట్ల‌కు వేలం నిర్వ‌హించి ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. మిగ‌తా 72 ప్లాట్ల‌తో మొద‌టి విడ‌త కింద 17 ప్లాట్ల‌కు మ‌రోసారి బ‌హిరంగ వేలం నిర్వ‌హిస్తున్నారు.
డీడీలు చెల్లించిన ప్ర‌జ‌లు
రాజీవ్ స్వ‌గృహ ప్లాట్ల వేలం నిర్వ‌హించేందుకు అధికారులు ఇప్ప‌టికే ఫ్రీబిడ్ స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప్లాట్ల వేలానికి సంబంధించి అనుమానాల‌ను నివృత్తి చేశారు. మొత్తం 17 ప్లాట్ల‌లో 250 గ‌జాల‌కు సంబంధించి 4 ప్లాట్లు, 200 గ‌జాల‌కు సంబంధించి 6 ప్లాట్లు, 150 గ‌జాల‌కు సంబంధించి 6 ప్లాట్లు, 100 గ‌జాల‌కు సంబంధించి 1 ప్లాటుకు వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఒక గజానికి రూ. 10వేల ధ‌ర‌ను నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. సోమ‌వారం నిర్వ‌హించే బ‌హిరంగ వేలంలో పాల్గొనేందుకు ల‌బ్దిదారులు రూ. 10వేల‌తో డీడీలు చెల్లించాల‌ని సూచించారు. ఈ మేర‌కు మొత్తం 21 మంది లబ్దిదారులు డీడీలు చెల్లించిన‌ట్లు తాండూరు ఆర్డీఓ కార్యాల‌య అధికారులు వెల్ల‌డించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 10వ తేది లోపు డీడీలు చెల్లించి కార్యాల‌యంలో స‌మ‌ర్పించ‌ని వారు సోమ‌వారం జ‌రిగే బ‌హిరంగ వేలం వ‌ద్ద నేరుగా స‌మ‌ర్పించి వేలంలో పాల్గొన‌వచ్చ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు బ‌హిరంగ వేలానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావ‌డంతో వేలం ఎవ‌రికి వ‌రిస్తుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.