గాంధీనగర్ పాఠశాల దత్తత
– దశలవారిగా స్కూల్ అభివృద్ధి
– పట్టణ ఎస్ఐ అరవింద్ కుమార్
– కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ సంగీత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు పట్టణ ఎస్ఐ అరవింద్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ పాఠశాలను ఎస్ఐ అరవింద్ వార్డు కౌన్సిలర్ సంగీత ఆజయ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుతో కలిసి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆరవింద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. పాఠశాలను పోలీసుశాఖ తరుపున దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బడిలో పిల్లలు సక్రమంగా బడికి వచ్చేలా చూస్తామన్నారు. ప్రధానంగా పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సమస్య ఉందని తెలుకోవడం జరిగిందన్నారు. వేసవి కాలం ముగిసే వరకు తన సొంత ఖర్చులతో పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. దీంతో పాటు వార్డు కౌన్సిలర్, దాతల సహాకారంతో పాఠశాల భవన పునర్ నిర్మాణం, మరుగుదొడ్లు, మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పాఠశాలలో ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా దృష్టి సారిస్తామన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు గాంధీనగర్ పాఠశాలలను ఆదర్శంగా మార్చి కార్పోరేట్ స్థాయి అందేలా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ పాఠశాల దత్తతకు ముందుకు వచ్చిన పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించిన ఎస్ఐ అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


