ఆరోజు నుంచే స్కూళ్ల రీఓపెనింగ్..

తెలంగాణ

ఆరోజు నుంచే స్కూళ్ల రీఓపెనింగ్..
– 1నుంచి పాఠ‌శాలల పునః ప్రారంభం
– తేదిని ఖ‌రారు చేసిన సీఎం కేసీఆర్
ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చేనెల సెప్టెంబ‌ర్ 1 నుంచి పాఠ‌శాల‌ల‌ను రీఓపెనింగ్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చ‌ర్చించారు. ఇప్ప‌టికే సెప్టెంబ‌ర్ 1నుంచి హైస్కూల్‌తో పాటూ ఇంట‌ర్, డిగ్రీ ఇంజ‌నీరింగ్‌లో ప్రత్యక్ష బోధన‌కు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, స్కూళ్లను ఎప్పటినుంచి ప్రారంభించాల‌నే అంశంపై ప్రభుత్వం త‌ర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. మొదటి దశలో 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ, ఇతర కళాశాలల్లోకి విద్యార్థులను అనుమతించాలని నిర్ణ‌యించారు. తర్వాత కిందిస్థాయి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు. యూనిసెఫ్‌, పార్లమెంట్ స్థాయీ సంఘం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తదితర విభాగాలు సైతం విద్యాసంస్థలను తెరవాలని ప్ర‌భుత్వాన్ని కోరాయి. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరచుకోవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది.ఈ క్రమంలో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది.