తెలంగాణలో దోపిడి రాజ్యం..!
– చేవేళ్ల- ప్రాణహితను అడ్డుకున్న కేసీఆర్
– సాగునీరివ్వని పార్టీని బండకేసి కొట్టాలే
– కాంగ్రెస్ అవేగానే జుట్లు పట్టుకున్నోళ్లు ఒక్కటయ్యారు
– 26న చేవేళ్ల సభకు 15వేల మంది తరలిరావాలి
– కాంగ్రెస్ జెండా ఎగురవేసే బాధ్యత కార్యకర్తలదే
– తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
– తాండూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని, పైకి కసురుకున్న లోపల బాయి భాయే అని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ లక్షల కోట్లను దోచుకున్నారని ద్వజమెత్తారు. ఆయన లక్షల కోట్లు దోచుకుంటే బీఆర్ఎస్ నేతలు వేల కోట్లు దోచుకున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో దోపిడి రాజ్యం ఏర్పడిందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కోడంగల్ ప్రాంతాలకు గోదావరి జలాలను అందించాలని దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రారంభించిన చేవేళ్ల ప్రాణహితను అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుని విధులను కాళేశ్వర ప్రాజెక్టుకు మళ్లించి.. మెదక్, సిద్ధిపేట, సిరిసిల్లా. జిల్లాలకు తరలించుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ వల్లే వికారాబాద్, తాండూరు, కోడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందకుండా చేవేళ్ల ప్రాణహిత ప్రాజెక్టు మూతపడిందని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టుపై మాట్లాడిన కొండా ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బాయి బాయి కావడం వల్లే అని అన్నారు. సాగునీరు అందించని బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బండకేసి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికారాబాద్, తాండూరు, కోడంగల్ ప్రాంతాలకు చేవేళ్ల ప్రాణహిత ద్వారా సాగు, తాగునీరు అందుతుందన్నారు.
జుట్లు పట్టుకున్నోళ్లు… ఒక్కటయ్యారు
కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరుకు చెందిన ఓ నేత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలియడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జింగిందన్నారు. మంత్రి పదవి తీసుకుంటున్న నేత, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పిరాయించిన నేత జుట్లు పట్టుకుని కొట్టుకున్నారని, ఇటీవల ఓ జాతరలో జరిగిన సందర్భాన్ని గుర్తుచేసి విమర్శించారు. అలా జుట్టుపట్టుకుని కొట్టుకున్న నేతలు కాంగ్రెస్ భయానికి కాళ్లుపట్టుకుని ఒక్కటయ్యారని విమర్శించారు. పార్టీ పిరాయించిన నేతతో పాటు మంత్రి పదవి చేపడుతున్న నేత తాండూరుకు ఏం సాధించలేదని అన్నారు. అదనంగా రూ. 10వేల కోట్లు తీసుకరాలేదని, ఇంజనీరింగ్ కాలేజీ సాధించలేదని ఎద్దేవా చేశారు. మీరు మీరు కలిసి పోయి భూ దందాలు, పదవులు, పైరవీలు పంచుకున్నారని మండిపడ్డారు. నమ్ముకున్న కార్యకర్తలను, నేతలను మోసం చేశారని అన్నారు.
తాండూరు, కోడంగల్ కు ప్రాధాన్యం
వికారాబాద్ నియోజకవర్గంలో తాండూరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా, చేవేళ్ల సెంటిమెంట్ గా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. తాండూరులో నమ్ముకుని.. గెలిపించుకున్న నేత పార్టీ పిరాయించిన కృంగిపోలేదని. కష్టపడి పార్టీని పటిష్టం చేసుకున్నందుకు ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దోపిడి రాజ్యం పోయి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కార్యకర్తలతో సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండేలా తాండూరుకు, కోడంగల్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.
చేవేళ్ల బహిరంగ సభకు తరలిరావాలి
ఈనెల 26న చేవేళ్లలో నిర్వహించే బహిరంగ సభకు నేతలు, కార్యకర్తలు తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవేళ్లలో నిర్వహించే డిక్లరేషన్ సభకు ఏఐసీసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరువుతున్నారని తెలిపారు. ఈ సభకు తాండూరు నుంచి 15 వేల మంది తరలివచ్చి కాంగ్రెస్ సత్తాచాటాలన్నారు. అంతకుముందు తాండూరు పురవీధుల్లో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీతో స్వాగతం పలికారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డికి గజమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, కల్వ సుజాత, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశోక్ బోయ, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

