టెట్ దరఖాస్తులకు వేళాయే..!
– 26 నుంచే ఆన్‌లైన్ ద్వారా స్వీకరణ
– జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. బుధవారమే 30,453 ఉద్యోగాలకు జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ద్వారా రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు.
టెట్ నిర్వహణలో మార్పులు
ప్రభుత్వం ప్రకటించిన జీవోలో ఈ సారి నిర్వహించే టెట్‌లో మార్పులు చేశారు. 2015లో డిసెంబర్ 23 నాటి టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 36లో రెండు ప్రధాన మార్పులను చేశారు. దీని ప్రకారమే ప్రభుత్వం టెట్‌పై జీఓ 8ను జారీ చేసింది. ఈ సారి మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి.
– ఇప్పటివరకు బీఈడీ అభ్యర్ధులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్ పేపర్-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్ పేపర్-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.
– ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. బెట్ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40) శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.
వివరాకుల ఈ లింక్ క్లిక్ చేయండి
https://tstet.cgg.gov.in


