పాత నేరస్తులపై నిఘా
– పెండింగ్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి
– గంజాయి, గుట్కా రవాణాలపై ప్రజలను చైతన్య పర్చాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– తాండూరులో సబ్ డివిజన్ క్రైం మీటింగ్
– ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పాత నేరస్థుల సమాచారాన్ని సేకరించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గుట్కా, గంజాయి, గ్ల్యాంబ్లింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో తాండూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నెల వారి నేరసమావేశాన్ని నిర్వహించారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి సబ్ డివిజన్ అధికారులు, ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ లో వున్న కేసులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి గారు పలు అంశాలపై పోలీస్ అధికారులకు పలుసూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి స్టేషన్ పోలీస్ అధికారి నమోదైన కేసులను పరిష్కరించేందుకుగాను నమోదయిన కేసులను అనుసరించి ప్రస్తుతం అమలులో వున్న ఏస్.ఓ.పి విధానాన్ని అనుసరిస్తు పోలీసు అధికారులు కేసులను పరిష్కరించడం సులభమవుతుందన్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం పెండింగ్ లో వున్న గ్రేవ్ కేసులను పరిష్కరించడంలో భాగంగా అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడంతో నేరస్థులను పట్టుకొనేందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, గ్రేప్ కేసుల్లో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు అవసరమయిన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని, పెండింగ్ లో వున్న పోక్సో కేసుల్లోను దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. దీంతో పాటు విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని అదే విధంగా పెట్రోకార్, బ్లూకోల్డ్ పనితీరుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు పర్యవేక్షించాలని, గంజాయి, గుడంబా, గుట్కా, గ్యాబ్లింగ్ వలన ప్రజలకు జరిగే నష్టాలపై ప్రజలతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలో విధ్యాసంస్థలతో పాటు, ప్రధాన కూడళ్ళలో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్ల ప్రస్తుత స్థితి గతులపై ఆరా తీయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా శ్రీ రామ జయంతి, హనుమాన్ జయంతి, రంజాన్ మొదలగు పండగలకు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతియుతంగా జరిగేటట్టు బందో బస్తుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు వివిధ కేసుల్లో ప్రతిభను కనబరిచిన పెద్దేముల్ ఎస్ఐ నాగరాజు, తాండూరు పోలీస్టేషన్ కానిస్టేబుల్ షబ్బీర్, బషీరాబాద్ కానిస్టేబుల్ చెన్నయ్య, యాలాల కానిస్టేబుల్ చంద్రయ్య, పెద్దేముల్ కానిస్టేబుల్ రవికుమార్, కరణ్ కోట్ కానిస్టేబుల్ కమలాకర్‌లకు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, తాండూరు సబ్ డివిజన్‌లోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

