పరమ పావనం శ్రీరామ నామం
– సీతారాములకు రామకోటి అంకితం
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీరామ నామం పరమ పావనమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని దివిటి గల్లిలోని శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన సీతారామచంద్ర విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఆలయంలో కొనసాగుతున్న ఉత్సవాలలో కొంతకాలంగా భక్తిశ్రద్దలతో శ్రీరాముని బొమ్మల్లో రచించిన రామకోటిని సీతారాములకు అంకింతమిచ్చారు. వేదపండితుల మంత్రోచ్చరణల మద్య కోట్రిక విజయలక్ష్మీ 4లక్షల 11 వేల రామకోటి పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ శ్రీరామ నామం ఎంతో పరమ పవిత్రమైందన్నారు. సీతారాముల విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా స్వామి వార్లకు అంకితమివ్వడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ పరిమళ, టీఆర్ఎస్ నాయకులు సంజీవరావు తదితరులు ఉన్నారు.


