బూస్టర్ డోస్ అర్హులకు శుభవార్త..!
– కోవాగ్జీన్, కోవిషీల్డ్ ధరల తగ్గింపు
దర్శిని డెస్క్ : కరోనా వ్యాప్తి నుంచి మెరుగైన రక్షణ కోసం బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రేపటి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారందరు బూస్టర్ డోస్ లేదా ప్రికాషన్ డోస్ వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ బూస్టర్ డోస్ ప్రైవేటు కేంద్రాల్లోనే తీసుకోవాలని సూచించింది. బూస్టర్ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్ (Covishield) డోసు ధరను మొదట రూ.600 కే అందుబాటులోకి తెస్తామన్నారు. దీనిపై సమాలోచనలు జరిపిన తరువాత బూస్టర్ డోసు వేసుకునే వారికి శుభవార్తను వినిపించారు. సామాన్యులకు ధరాభారం కావద్దనే ఉద్దేశ్యంతో కొవిషీల్డ్ ధరను రూ.225కు తగ్గిస్తూ అదర్ పూనావాలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అదేవిధంగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్(Covaxin) కూడా కొవిషీల్డ్ బాటలోనే పయనించింది. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో తాము కూడా ధరను తగ్గిస్తున్నట్లు సుచిత్రా ఎల్లా వెల్లడించారు. ప్రైవేటు క్లినిక్ లలో రూ.1200కే ఇస్తామన్న కొవాగ్జిన్ బూస్టర్ డోసును రూ.225కే అందిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

