అయ్యో.. సీతారామా..!
– జుంటుపల్లిలో హుండీ చోరీ
– నగదును దోచుకెళ్లిన దుండగులు
– సీసీ పుటేజీని తీసుకెళ్లి పోలీసుల విచారణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లి సీతారామా స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. బుధవారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ సంఘటన కలవరానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే… మంగళవారం రాత్రి 20 నుంచి 3 మంది వరకు ఉన్న ఓ కుటుంబం దేవాలయంలో రాత్రి బస చేసేందుకు వచ్చారు. వారితో పాటు ఓ కారు, బైకులో గుర్తుతెలియని వ్యక్తులు కూడా వచ్చారు. బుధవారం తెల్లవారు జామున చూసే సరికి దేవాలయంలో తాళాలు విరగ్గొట్టి లోపల ఉన్న హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న దేవాలయ ఈఓ యాలాల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు దేవాలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. దేవాలయంలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలించి దానిని వెంట తీసుకెళ్లారు. అంతకుముందు దేవాలయంలో రాత్రి బస చేసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. వారిపై ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే ఓ కారు, బైకు పై వచ్చిన వారిపై అనుమానాలను వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా దేవాలయం నుంచి చోరీకి గురైన హుండీని సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు గుర్తించారు.
అయితే దేవాలయంలో గత నెల 30వ తేదిన లెక్కింపు చేశారు. ఈ నెల నుంచి సంబంధించిన కానుకలు, నగదు హుండీలో ఉన్నాయని ఈఓ తెలిపారు. హుండీలో దాదాపు రూ. 7 నుంచి 8వేల వరకు నగదు ఉండొచ్చని తెలిపారు. కాగా హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు నగదుపు తీసుకుని వెండి ఆభరణాలను అలాగే వదిలేయడం గమనార్హం. ఆభరణాలను ఎత్తుకెళ్లితే దొరికిపోతామనే భయంతో వదిలివెళ్లినట్లు పలువురు చర్చించుకున్నారు. సీతారామా స్వామి దేవాలయంలో చోరీ జరగడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

