మోడీకీ డెడ్‌లైన్..!
– ధాన్యం సేకరణపై గడువు
– మార్పులేకుంటే యుద్దమే
– ఢిల్లీ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్
దర్శిని డెస్క్: కేంద్రప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్ విధించారు. వడ్ల కొనుగోళ్లపై గడువు ప్రకటించి.. పద్దతి మార్చుకోకపోతే యుద్దానికి సిద్దమే అంటూ తేల్చి చెప్పారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. నరేంద్రమోడి ఎవరితోనైనా పెట్టుకో.. కాని రైతులతో మాత్రం పెట్టుకోవద్దని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి మోడి కారణం కాదా అంటూ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. 24 గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంతో ఇక తాడోపేడో అన్నట్లుగా ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఇందుకు రైతులు సిద్దంగా ఉన్నారని అన్నారు. మరోవైపు కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రాకేశ్ తికాయత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.

