సీసీ కెమెరా డీవీఆర్‌ను ఎత్తుకెళ్లిన ఘ‌నులు

క్రైం తాండూరు వికారాబాద్

సీసీ కెమెరా డీవీఆర్‌ను ఎత్తుకెళ్లిన ఘ‌నులు
– బ‌షీరాబాద్ ఎస్బీఐ బ్యాంకులో చోరీ య‌త్నం
– ప‌రిశీలించిన తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌ల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో అనుమానాస్పద‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన చోరీ జ‌రిగింది. బ్యాంకు ఆస్తుల ర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్‌ను గుర్తుతెలియ‌ని ఘనులైన చోరులు ఎత్తుకెళ్లిపోయారు. ఆదివారం అర్ద‌రాత్రి దాటిన త‌రువాత జ‌రిగిన ఈ సంఘ‌ట‌న సోమ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. సోమ‌వారం బ్యాంకు ప‌రిస‌రాల‌ను అనుమానాస్పదంగా క‌నిపించ‌డంతో బ్యాంకు ప్ర‌తినిధులు పోలీసులు స‌మాచారం అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు చోరీ జ‌రిగిన‌ట్లు నిర్దార‌ణకు వ‌చ్చారు. బ్యాంకు ప‌రిస‌రాల‌లోని అన్ని సీసీ కెమెరాల‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. విష‌యాన్ని తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు తెలిపారు. డీఎస్పీ బ‌షీరాబాద్‌కు చేరుకుని బ్యాంకు ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు.
బ్యాంకులో జ‌రిగిన చోరీ య‌త్నంపై ఎస్ఐ విద్యాచ‌ర‌ణ్ రెడ్డి, బ్యాంకు మేనేజ‌ర్ల‌తో క‌లిసి ఆరా తీశారు. అయితే బ్యాంకులో ఎలాంటి విలువైన ఆస్తులు చోరీ కాలేద‌ని, భ‌ద్ర‌త కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రికార్డు చేసే డీవీఆర్‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు ప్రాథ‌మికంగా గుర్తించారు. బ్యాంకులో చోరీకి య‌త్నించిన ఘ‌ట‌న‌పై స్పందించి క్లూస్ టీంను రంగంలోకి దించి వివ‌రాల‌ను సేక‌రించారు. టెక్నిక‌ల్ ముఠా చేసిన ప‌ని అయి ఉంటుంద‌ని విచార‌ణ ముమ్మ‌రం చేస్తున్న‌ట్లు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ వెల్ల‌డించారు.