పట్టణ ప్రగతిని మెరిపించాలి
– టీఎస్ బీపాస్‌లో అవినీతి చేస్తే చర్యలు
– మున్సిపల్లో ఖాళీల భర్తిపై దృష్టి
– సమీక్షలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతితో నగరాలను, పట్టణాలను మెరిపించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని వెంగళ్రావునగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై మేయర్లు, చైర్మన్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్రతి పట్టణంలో మోడల్ మార్కెట్లు, డిజిటల్ డోర్ నంబరింగ్, ఆధునిక దోబీ ఘాట్లు, మానవ వ్యర్థాల శుద్ధి, నిర్వహణ ప్లాంట్, మోడల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, బయో మైనింగ్ వంటి లక్ష్యాలను పురపాలికలు సాధించాలన్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్దేశించిన హరితహారానికి సంబంధించిన లక్ష్యాలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం చట్టప్రకారం నిర్దేశించిన టీఎస్ బీపాస్ ప్రకారం 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అవకతవకలకు పాల్పడితే, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రతి పురపాలికల్లో చేపట్టిన అభివృద్ధిని నగర పౌరుల ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలో మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు నియామకాల ప్రాసెస్‌ని పూర్తి చేస్తామని, పురపాలికల్లో వార్డ్ ఆఫీసర్ల వ్యవస్థ, ఇందుకు సంబంధించిన సిబ్బంది నియామకం త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు.

